నేరేడుచర్ల రోడ్డు ప్రమాదం, NewzFast Telugu (సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల): సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భర్త కళ్ల ఎదుటే భార్య మృతి చెందింది. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల ప్రకారం, ఖమ్మం జిల్లా పల్లిగూడెం గ్రామానికి చెందిన గురువమ్మ (40) తన భర్త వెంకన్నతో కలిసి మిర్యాలగూడ నుంచి హుజూర్‌నగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ దంపతులు చిలక జ్యోతిష్యం చెబుతూ జీవనం సాగిస్తున్నారు.
నేరేడుచర్ల పట్టణంలోని చౌరస్తా వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ వారి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గురువమ్మ రోడ్డుపై పడిపోగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.
ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ల కిందకు ద్విచక్ర వాహనం వెళ్లిందని సమాచారం. ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ పరారైనట్లు తెలుస్తోంది.
మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య మృతితో భర్త వెంకన్న విలపిస్తున్న దృశ్యం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.
వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు నేరేడుచర్ల ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.




