జాతీయ విద్యా దినోత్సవం, NewzFast Telugu (కర్నూలు): కర్నూలు నగరంలోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల, బి. క్యాంప్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి మరియు జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ S.
నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త మరియు దార్శనికుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ S. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ విద్యావ్యవస్థ అభివృద్ధికి పునాదులు వేసిన మహనీయులని, దేశంలోని ప్రతి ఒక్కరికీ విద్య అందాలనే గొప్ప ఆశయంతో అనేక విద్యా సంస్కరణలకు కృషి చేశారని తెలిపారు.
ఆయన కృషి ఫలితంగానే దేశంలో విద్యా రంగానికి విశేష ప్రాధాన్యత లభించిందని పేర్కొన్నారు.
విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక బాధ్యతకు, దేశాభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా నేటి విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం ద్వారా సమాన అవకాశాలు కల్పించవచ్చని, విద్యావంతులైన యువత దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జీవితాన్ని, విద్య పట్ల ఆయనకున్న అంకితభావాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విద్య యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, సమాజంలో విద్యా అవగాహన పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు సమిష్టిగా కృషి చేయాలని ఈ కార్యక్రమంలో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ సభ్యులు మల్లికార్జున, విజయశేఖర్, ఉల్గోజి రావు, శారధి పటేల్, శ్రీధర్ మూర్తి, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.




