నారాయణపేట పొగమంచు, NewzFast Telugu (నారాయణపేట): నారాయణపేట జిల్లాలో వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డా.వినీత్ సూచించారు. వీలైనంత వరకు రాత్రి వేళల్లో, తెల్లవారుజామున ప్రయాణాలను నివారించాలని ఆయన జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం తప్పనిసరైతే వాహనాలను నెమ్మదిగా, జాగ్రత్తగా నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ సూచించారు. ఇటీవల పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.
రాత్రి వేళల్లో, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, మలుపులు సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. తక్కువ దూరం మాత్రమే కనిపించే పరిస్థితుల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారితీస్తుందని, అత్యవసరమైతే తప్ప ఈ సమయాల్లో ప్రయాణాలు చేయవద్దని ఆయన స్పష్టం చేశారు.




