నారాయణగిరి ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన వంట వివాదం, NewzFast Telugu (హనుమకొండ జిల్లా, ధర్మసాగర్ మండలం): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వంట నిర్వహణపై వివాదం నెలకొంది.
గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న తమను ఇప్పుడు పక్కనపెట్టి, వంట చేయకుండా అడ్డుకుంటున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పాఠశాల వద్ద మహిళలు తమ నిరసనను వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలైనప్పటి నుంచి మహిళా సంఘ సభ్యులమైన తాము భోజనం వండి పెడుతున్నామని వారు తెలిపారు. అయితే ఇప్పుడు తమను కాదని కేవలం ఆరుగురు మహిళలతోనే వంట చేయిస్తున్నారని పేర్కొన్నారు.
తాము కూడా వంట చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అవకాశం కల్పించకుండా అడ్డుకోవడం న్యాయమేనా అని ప్రశ్నించారు. ఈ వివాదం గ్రామంలో మహిళల మధ్య ఘర్షణలకు దారితీస్తోందని ఆరోపించారు.
ఈ విషయంలో సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. లేని పక్షంలో పాఠశాల ప్రాంగణంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
