నారా లోకేశ్, NewzFast Telugu (కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్): శిథిలావస్థకు చేరిన తమ పాఠశాల భవనాన్ని బాగుచేయాలని, వర్షం వస్తే తరగతి గదుల్లో కూర్చోలేకపోతున్నామంటూ ఓ చిన్నారి చేసిన విజ్ఞప్తికి మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. డాక్టర్ బి.ఆర్.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిధిలోని అగ్రహారం బాడవ ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై ఆ చిన్నారి తన గోడును చెప్పుకున్న వీడియో సోషల్ మీడియా ద్వారా మంత్రి దృష్టికి చేరింది.
పాఠశాల పైకప్పు పెంకులు ఊడిపోవడంతో, వర్షం పడిన ప్రతిసారీ నీరు నేరుగా తరగతి గదుల్లోకి చేరి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీడియోలో చెప్పారు. ఈ పరిస్థితిపై లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.
సమస్య తీవ్రతను గుర్తించిన మంత్రి, అగ్రహారం బాడవ ప్రభుత్వ పాఠశాలకు త్వరలోనే పూర్తిస్థాయి నూతన భవనం నిర్మిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. విద్యార్థులు అసౌకర్యాలతో చదువుకునే పరిస్థితి ఏ పాఠశాలలోనూ ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.
కొత్త భవన నిర్మాణానికి అవసరమైన నిధులు, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.
నూతన భవన నిర్మాణం పూర్తయ్యే వరకు విద్యార్థుల చదువులకు, భద్రతకు ఆటంకం కలగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుత వర్షాకాల పరిస్థితుల్లో తరగతి గదుల్లోకి నీరు చేరకుండా తక్షణమే తాత్కాలిక మరమ్మతులు, ప్రత్యామ్నాయ రక్షణ చర్యలు చేపట్టాలని కోనసీమ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
అవసరమైతే సమీపంలోని సురక్షితమైన ప్రత్యామ్నాయ భవనంలో తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని యంత్రాంగానికి సూచించారు.
చిన్నారి వీడియో విజ్ఞప్తికి మంత్రి ఇంత వేగంగా స్పందించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల కష్టాలను తన సమస్యగా భావించి స్పందించిన లోకేశ్ తీరుపై అగ్రహారం బాడవ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




