నలమాస శ్రీకాంత్ గౌడ్, NewzFast Telugu (వరంగల్): నిరుద్యోగ యువత ఆశయాల సాధనకు, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ రక్షణ సేన వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నలమాస శ్రీకాంత్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పోరాడిన తనకు యువత, నిరుద్యోగుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు.
సామాజిక న్యాయం, బహుజన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తనకు ఒక్క అవకాశం కల్పించాలని పట్టభద్రులను విజ్ఞప్తి చేశారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించి పీహెచ్డీ సాధించిన తాను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని, పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిగా సామాన్యులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన బహుజన బిడ్డగా తనను ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.
గతంలో హామీలిచ్చి గెలిచిన కొందరు ప్రజాప్రతినిధులు పాలక పక్షాలకు అనుకూలంగా మారారని, తాను మాత్రం ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి పోరాడతానని స్పష్టం చేశారు.
తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బహుజన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని, మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన బీసీ బిడ్డకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారని ఎన్నికల ఇన్చార్జి ఇస్మాయిల్ తెలిపారు. వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రులు శ్రీకాంత్ గౌడ్‌కు మద్దతుగా నిలిచి బహుజన బిడ్డను గెలిపించాలని, తద్వారా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకు తోడ్పడాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి ఉద్యమకారులను విస్మరించిందని విమర్శించారు. ఉద్యమంలో సర్వం కోల్పోయిన వారిని పక్కనపెట్టి, ఆర్థిక, అంగబలం ఉన్నవారికే రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు.
అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ, వాటి అమలులో విఫలమైందని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను నిరాశపరిచిందని అన్నారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వేలు, పోస్టల్ శాఖతో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తూ ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు.
స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి అవకాశాలు కల్పించడం వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆశీర్వాదంతో తనకు లభించిన ఈ అవకాశాన్ని ప్రజాసేవకు వినియోగిస్తానని శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. అశోక్‌నగర్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందులు తనకు తెలుసని, వారి సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే క్షేత్రస్థాయిలో వారి వెంట ఉంటూ, తమ సమస్యలను పరిష్కరించుకునేలా బాధ్యతతో పనిచేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి వీర బిక్షపతి, జిల్లా అధ్యక్షుడు మాడిపల్లి వెంకటేశ్వరరావు, కార్యదర్శి మాడుల రాజిరెడ్డి, జిల్లా నాయకులు శ్రీశైలం, సుమన్ సుతేజ్ రవి, రాధాకృష్ణ రమాదేవి, రవికుమార్, సోల్తి కిషోర్, నిశాంత్ రావు, చిలుక ప్రవీణ్, విద్యార్థి నాయకులు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.




