నల్లగొండ అగ్రిషో, NewzFast Telugu (నల్లగొండ): రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, శాస్త్రీయ పరిజ్ఞానం, నూతన సాంకేతికతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నల్లగొండలో మూడు రోజుల పాటు అగ్రిషో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు.
ఈ నెల 14, 15, 16 తేదీల్లో పట్టణంలోని గడియారం సెంటర్లో నిర్వహించే ఈ ప్రదర్శనను రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రతినిధులు, పట్టణ ప్రజలు సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గురువారం నల్లగొండలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, బండ శ్రీశైలం, ఎండీ హషం, పాలడుగు నాగార్జునతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
నల్లగొండలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరగనున్న అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలు, 41వ సర్వసభ్య సమావేశంలో భాగంగా ఈ అగ్రిషోను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
ఈ నెల 14న ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అగ్రిషోను ప్రారంభించనున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని తెలిపారు.
మూడు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రదర్శన కొనసాగుతుంది.
మొత్తం 125 ప్రదర్శనశాలలు ఏర్పాటు చేసినట్లు, అవసరమైతే మరిన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రదర్శనలో డ్రోన్లు, ట్రాక్టర్లు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, నూతన విత్తన రకాలు, ఎరువులు, బిందు మరియు తుంపర సేద్య పరికరాలు, వివిధ సాగునీటి విధానాలు అందుబాటులో ఉంచనున్నారు.
రైతులు వీటిని పరిశీలించి ఆధునిక పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో రాము నాయక్, ఎండీ సలీం, వెంకట్‌రెడ్డి, పుచ్చకాయ నర్సిరెడ్డి, నలపరాజు సైదులు, కొండ వెంకన్న, పి.సత్యనారాయణ, వి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




