ముస్తాబాద్ బావి ప్రమాదం, NewzFast Telugu (రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్): రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది.
ముస్తాబాద్ మండల కేంద్రంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ఒక కుటుంబానికి చెందిన అమ్ములు (3) అనే చిన్నారి స్థానిక నవజ్యోతి పాఠశాల సమీపంలో ఆడుకుంటోంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న వ్యవసాయ బావిలో ఆమె ప్రమాదవశాత్తు పడిపోయింది.
చిన్నారి బావిలో పడిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు సమాచారం.
ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో ముస్తాబాద్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.




