మురుగు కాలువలో పసికందు మృతదేహం, NewzFast Telugu (కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, చింతలమానేపల్లి మండలం): కళ్లు తెరిచి లోకాన్ని చూడకముందే ఒక పసిప్రాణం కడతేరింది. కన్నవారి కర్కశత్వానికో, మరే ఇతర కారణానికో బలై మురుగు కాలువలో విగతజీవిగా పడి ఉన్న ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం రేపింది.
చింతలమానేపల్లి మండలం దిందా గ్రామ శివారులో గురువారం ఉదయం ఈ అమానుష ఘటన వెలుగుచూసింది. దిందా గ్రామ శివారులోని మురుగు కాలువ వద్ద వీధి కుక్కలు ఒక కవర్ను లాగుతుండటాన్ని అటుగా వెళ్తున్న స్థానికులు గమనించారు.
అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూడగా, ఆ కవర్లో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం కనిపించడంతో వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ విషయాన్ని వెంటనే స్థానిక పోలీసులకు చేరవేశారు.
సమాచారం అందుకున్న చింతలమానేపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పసికందును అక్కడ పడేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులను పట్టుకునేందుకు గ్రామంలోకి వచ్చే దారుల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ విచారణ వేగవంతం చేశారు.




