మురసు తుపాను కేంద్ర బృందం పర్యటన, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): ఏపీని మురసు తుపాను ముంచెత్తిన విషయం తెలిసిందే. తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర హోంశాఖ, తుపాను ప్రభావిత జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపనుంది. ఈ బృందానికి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాస్ నేతృత్వం వహిస్తారు.
శుక్రవారం రాష్ట్రానికి రానున్న ఏడుగురు సభ్యుల ఈ కేంద్ర బృందం రెండు రోజుల పాటు తుపాను ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అర్నబ్ తుపాను నష్టాలను అంచనా వేయడానికి నియమించిన కేంద్ర బృందాన్నే (IMCT) మురసు తుపాను నష్టాల అంచనాకు కూడా కేంద్ర ప్రభుత్వం నియమించినట్లు ఆయన తెలిపారు.
శుక్రవారం టీమ్-1 బాపట్ల జిల్లాలో, టీమ్-2 ఏలూరు జిల్లాలో పర్యటించనుంది. శనివారం టీమ్-1 పల్నాడు జిల్లాలో, టీమ్-2 తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి నష్టాలను స్వయంగా పరిశీలించడంతో పాటు తుపాను బాధితులతో మాట్లాడనుంది.
ఆదివారం ఈ కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బృందంలో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, జల వనరుల మంత్రిత్వ శాఖ (సీడబ్ల్యూసీ), ఆర్థిక, రోడ్డు రవాణా, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ మంత్రిత్వ శాఖల అధికారులతో పాటు ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) శాస్త్రవేత్త కూడా ఉన్నారు.




