ముద్రా లోన్ పథకం, NewzFast Telugu: ప్రధానమంత్రి ముద్రా లోన్ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాబోయే ఐదేళ్లకు రూ.5 వేల కోట్ల గ్యారంటీ కార్పస్ ఫండ్‌కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా రూ.1.26 లక్షల కోట్ల విలువైన రుణాలు వ్యాపారులకు అందే మార్గం సుగమమైంది.
నవంబర్ 11న జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం చిన్న వ్యాపారులకు పెద్ద ఊరటగా భావిస్తున్నారు. ఇప్పటికే చిన్న వ్యాపారం నడుపుతున్నవారు తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఈ రుణాన్ని తీసుకోవచ్చు.
చిన్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడం ఈ నిర్ణయం వెనుక ఉద్దేశంగా ఉంది.
రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా రూ.1.26 లక్షల కోట్ల విలువైన ముద్రా రుణాలు మంజూరు చేయనున్నారు. దీని వల్ల చిన్న వ్యాపారులకు రుణాలు సులువుగా అందుతాయని అంచనా.
కేంద్రం రూ.5 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేయడం ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నష్ట భయం తగ్గుతుంది. దీంతో రుణాలను వేగంగా మంజూరు చేయడానికి, ఎక్కువమందికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు సహాయం లభిస్తుంది.
ఈ పథకం ద్వారా చిన్న దుకాణాలు, స్టార్టప్‌లు, తయారీదారులు రుణాలు పొందవచ్చు. ఈ రుణాలకు ఎలాంటి పూచీకత్తు అవసరం ఉండదని నివేదిక పేర్కొంది.
దీని వల్ల హామీలు లేని చిన్న వ్యాపారాలు కూడా సులువుగా రుణాలు పొందగలవు.
ముద్రా రుణాలను శిశు, కిశోర్, తరుణ్ కేటగిరీలుగా విభజించారు. శిశు కేటగిరీ కింద రూ.50 వేల వరకు, కిశోర్ కేటగిరీ కింద రూ.5 లక్షల వరకు, తరుణ్ కేటగిరీ కింద రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు.
కిరాణా దుకాణాలు, చిన్న తయారీ యూనిట్లు, సేవా రంగం, చేతివృత్తులవారు, వీధి వ్యాపారులు వంటి చిన్న వ్యాపారులకు ఈ రుణాలు అందించనున్నారు. నిరుద్యోగ యువత సొంతంగా ఉపాధిని లేదా స్టార్టప్‌ను ప్రారంభించాలనుకుంటే కూడా ఈ పథకం ద్వారా సహాయం పొందవచ్చు.




