ఎంపీపీ జడ్పీ ఛైర్‌పర్సన్ ఎన్నికలు, NewzFast Telugu (అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీపీ, జడ్పీ ఛైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 19న ఎంపీపీల ఎన్నికలు, నవంబర్ 20న జడ్పీ ఛైర్‌పర్సన్ల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
నవంబర్ 14లోగా ప్రత్యేక సమావేశాలకు సంబంధించి సభ్యులకు నోటీసులు జారీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల రోజున ఉదయం 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఓటింగ్ చేతులెత్తే పద్ధతిలో జరుగుతుంది.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల విప్‌కు అనుగుణంగానే సభ్యులు ఓటు వేయాలి. విప్‌ను ధిక్కరిస్తే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది.
అయితే కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు ఈ నిబంధన వర్తించదు. అధ్యక్ష, ఛైర్‌పర్సన్ ఎన్నిక పూర్తయ్యాకే ఉపాధ్యక్ష, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహిస్తారు.
కోరం లేకపోవడం లేదా ఇతర కారణాలతో ఎన్నిక వాయిదా పడితే మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. ఎన్నికల సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించినప్పటికీ వారికి ఓటు హక్కు ఉండదు.
ఎన్నికల పారదర్శకత కోసం వీడియో చిత్రీకరణ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 కింద భద్రత కల్పించనున్నారు.
ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యక్ష ప్రసారాలకు కూడా అనుమతి ఉంటుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.




