మహ్మద్ అయాన్ షూట్బాల్, NewzFast Telugu (వికారాబాద్): షూట్బాల్ క్రీడల్లో రాణిస్తున్న వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్‌పేట్ మండలం వెల్ చాల్ గ్రామానికి చెందిన మహ్మద్ షాబుద్దీన్ కుమారుడు మహ్మద్ అయాన్‌ను తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అభినందించారు.
ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నేపాల్ రాజధాని ఖాట్మండులో జరగనున్న 1వ అంతర్జాతీయ షూట్బాల్ ఎమర్జింగ్ కప్ టోర్నమెంట్లో భారతదేశం తరఫున మహ్మద్ అయాన్ పాల్గొననున్నాడు. భారతదేశం నుంచి ఈ పోటీలకు మొత్తం 12 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి షూట్బాల్ క్రీడల్లో ఎంపికైన ఏకైక క్రీడాకారుడు మహ్మద్ అయాన్ మాత్రమే. తెలంగాణ నుంచి ఈ అంతర్జాతీయ టోర్నమెంట్‌కు ఎంపికైన ఏకైక క్రీడాకారుడిగా అయాన్ నిలిచాడు.
ఈ పోటీల కోసం ఈ నెల 18వ తేదీన అయాన్ నేపాల్‌కు బయలుదేరనున్నాడు.
ఈ నేపథ్యంలో గురువారం అయాన్, తన తండ్రి మహ్మద్ షాబుద్దీన్ వెల్ చాల్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. స్పీకర్ అయాన్‌ను అభినందించి, ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, గ్రామీణ, పట్టణ క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తోందని చెప్పారు. క్రీడలే యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, అందుకే క్రీడా మౌలిక వసతుల కల్పనకు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు అండగా నిలవడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
తన నియోజకవర్గంలోని క్రీడాకారులకు తప్పనిసరిగా అండగా ఉంటానని స్పీకర్ హామీ ఇచ్చారు. నేపాల్ వేదికగా జరిగే టోర్నమెంట్లో మహ్మద్ అయాన్ సత్తా చాటి తెలంగాణ, వికారాబాద్ నియోజకవర్గం, తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు.
చదువులోనూ, క్రీడల్లోనూ రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అయాన్‌కు సూచించారు.
స్పీకర్ అభినందించి, ఆశీర్వదించినందుకు అయాన్ తండ్రి మహ్మద్ షాబుద్దీన్, విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.




