మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ డౌన్, NewzFast Telugu (ప్రపంచవ్యాప్తం): ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన కీలక వార్త వెలుగులోకి వచ్చింది. గురువారం అర్థరాత్రి నుంచి మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ సేవ Outlook, అలాగే Microsoft 365 సేవల్లో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడింది.
దీంతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు ఈమెయిల్స్ పంపడం, స్వీకరించడం, తమ అకౌంట్లలో లాగిన్ అవడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, సాంకేతిక లోపం కారణంగా అనేక ప్రాంతాల్లో కనెక్టివిటీ ప్రభావితమైంది.
సమస్యను పరిష్కరించేందుకు తమ సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
ఆన్లైన్ సేవల్లో అంతరాయాలను ట్రాక్ చేసే DownDetector ప్రకారం, ఈస్టర్న్ టైమ్ ప్రకారం మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో Outlook సమస్యలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఫిర్యాదుల సంఖ్య వేగంగా పెరిగింది.
సమస్య తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో Outlookకు సంబంధించి లక్షకు పైగా రిపోర్టులు నమోదయ్యాయి. అదే విధంగా, Microsoft 365 సేవల్లో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు 15 వేల మందికి పైగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు.
ఈ అవుటేజ్‌ను మైక్రోసాఫ్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా ధృవీకరించింది. సమస్యపై తమ బృందం దర్యాప్తు చేస్తోందని తెలిపింది.
ప్రారంభంలో ఈ సమస్య అమెరికాకే పరిమితమైనట్లు కనిపించినప్పటికీ, తర్వాత దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశం ఉందని కంపెనీ అంగీకరించింది.
సమస్య ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ప్రస్తుతం సాంకేతిక బృందాలు సమస్యకు కారణాన్ని గుర్తించి, సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.




