ఎంబీయూ ఉచిత సివిల్స్ శిక్షణ, NewzFast Telugu (తిరుపతి): క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యే తమ ప్రధాన ధ్యేయమని, క్యాంపస్లో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి తన బిడ్డతో సమానమని ప్రముఖ విద్యావేత్త, మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) ఛాన్సలర్ డాక్టర్ మంచు మోహన్ బాబు పేర్కొన్నారు.
గురువారం యూనివర్సిటీ ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన 2026-27 విద్యా సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నామని ఆయన తెలిపారు.
యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు అత్యున్నత వేతనాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలుపుతుంటే ఒక విద్యాసంస్థ అధినేతగా ఎంతో సంతోషం కలుగుతుందని ఆయన భావోద్వేగంగా చెప్పారు.
ఈ సందర్భంగా సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేయాలనుకునే విద్యార్థులకు ఛాన్సలర్ ఒక గొప్ప వరాన్ని ప్రకటించారు. యూనివర్సిటీలో చదువుతూ ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS), ఐఆర్ఎస్ (IRS) వంటి ఉన్నత సివిల్ సర్వీస్ ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యం ఉన్న విద్యార్థులకు, సంస్థ తరఫున పూర్తిగా ఉచిత శిక్షణ అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఆయన ప్రకటనతో ప్రాంగణమంతా విద్యార్థులు, తల్లిదండ్రుల హర్షధ్వానాలతో మారుమోగింది.
తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తమ పిల్లలను యూనివర్సిటీకి పంపిస్తున్నారని, వారి ఆశయాలను నిజం చేసే బాధ్యత తమపై ఉందని మోహన్ బాబు స్పష్టం చేశారు. విద్యాప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
ఆత్మీయ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పి.వి. రమణ, రిజిస్ట్రార్ సారథి, ఫైనాన్స్ ఆఫీసర్ రవిశంకర్, వివిధ విభాగాల డీన్స్, అధ్యాపకులు, సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.




