మౌలానా అబుల్ కలాం ఆజాద్, NewzFast Telugu (మహబూబాబాద్): భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ అన్నారు.
బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన 138వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి, విద్యా సంస్కరణలకు ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు, యూజీసీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు ఆయన విశేష కృషి చేశారని తెలిపారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొని దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తుచేశారు.
ఆజాద్ ఆశయాలు, దేశభక్తి, విద్యారంగానికి చేసిన సేవలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, విద్యకు ప్రాధాన్యతనిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగలక్ష్మి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్, వివిధ శాఖల అధికారులు, మైనారిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




