మంచిర్యాల రోడ్ల విస్తరణ, NewzFast Telugu (మంచిర్యాల): మంచిర్యాల నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. నగరంలోని ప్రధాన రహదారులపై డివైడర్ల నిర్మాణంతో పాటు రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఇటీవల 17వ డివిజన్ పరిధిలోని గుడిపేట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఐ రవీందర్, హాజీపూర్ ఎస్సై కిరణ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రహదారికి ఇరువైపులా పెరిగిన పొదలను తొలగించాలని, పెద్ద చెట్ల తొలగింపునకు అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
కల్వర్టులను వెడల్పు చేయడంతో పాటు రాత్రివేళల్లో ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, వైట్ పెయింటింగ్, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని సూచించారు.
పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా పాత మంచిర్యాల నుంచి నగర శివారు ప్రాంతాల వరకు రహదారుల విస్తరణ, డివైడర్ల నిర్మాణానికి త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. లిక్కర్ గోదాం ఎదుట లారీలు, డీసీఎం వ్యాన్లను రోడ్డుపై నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని గోదాం మేనేజర్‌కు సూచించారు.
వాహనాల కోసం ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
మంచిర్యాల నగర అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.225 కోట్లతో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, రహదారుల విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా రాళ్లపేట సమీపంలోని రాళ్లవాగుపై రూ.23 కోట్ల వ్యయంతో నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే, మేయర్ దర్ని మధుకర్ కలిసి ప్రారంభించారు.
లక్ష్మీనగర్ నుంచి రంగపేట వరకు, క్వారీ రోడ్డు నుంచి అండాలమ్మ కాలనీ వరకు నాలుగు వరుసల రహదారిని నిర్మించనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి పాత మంచిర్యాల వరకు ఆరు వరుసల రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
నగరంలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మేయర్ దర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పుదారి తిరుపతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




