మంచిర్యాల తాగునీటి ప్రత్యేక డ్రైవ్, NewzFast Telugu (మంచిర్యాల): రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మంచిర్యాల జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు.
నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ సమయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను సమగ్రంగా పరిశీలిస్తారు.
నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గ్రామీణ నీటి సరఫరా, మిషన్ భగీరథ అధికారులతో పాటు ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు, డీఈలు, ఏఈలకు పలు సూచనలు చేశారు.
ప్రతి గ్రామం, ప్రతి ఆవాసంలో తాగునీటి సరఫరా పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. పైప్లైన్ల లీకేజీలు, వాల్వ్‌ల పనితీరు, నీటి సరఫరాలో లోపాలను గుర్తించి వెంటనే సరిచేయాలని సూచించారు.
నీటి నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, ఓవర్‌హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్లు, మ్యాన్‌హోల్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. క్లోరినేషన్, అవసరమైన మేరకు బ్లీచింగ్ పౌడర్ వినియోగం ద్వారా నీటి నాణ్యతను నిర్ధారించాలన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో వేసవిలో నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలను ఇప్పుడే గుర్తించాలని, ప్రత్యామ్నాయ నీటి వనరులు, సరఫరా మార్గాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు తాగునీటి సమస్యలు ఎదురైతే 1916 టోల్‌ఫ్రీ నంబర్‌ను వినియోగించేలా విస్తృత ప్రచారం కల్పించాలని కూడా సూచించారు.
