మహేశ్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీ సమావేశం, NewzFast Telugu (తెలంగాణ): లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం ముగిసింది. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం కొనసాగింది.
ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, ఓబీసీల ప్రాతినిధ్యం, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించినట్లు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలను కూడా వివరించినట్లు తెలిపారు.
భారత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ ఈ నెల 13 లేదా 14 తేదీల్లో హైదరాబాద్‌కు రానున్నట్లు ఆయన చెప్పారు. భారత్ సమ్మిట్‌తో పాటు గిగ్ వర్కర్ల సమావేశంలోనూ రాహుల్ పాల్గొంటారని తెలిపారు.
హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ కోరినట్లు వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం గిగ్ యాక్ట్ తీసుకొచ్చిందని కూడా గుర్తు చేశారు.
ఓబీసీల అంశంతో పాటు వివిధ రంగాల్లో వారికి కల్పించాల్సిన ప్రాతినిధ్యంపై సమావేశంలో చర్చించినట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో పీసీసీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై రాహుల్ గాంధీకి నివేదిక అందజేసినట్లు చెప్పారు.
రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలు, వివాదాలు, పంచాయితీలపై రాహుల్ గాంధీతో ఎలాంటి చర్చ జరగలేదని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాలను పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చూసుకుంటారని తెలిపారు.
హైదరాబాద్‌లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నిర్వహించే సభతో పాటు మెగా బీసీ ర్యాలీకి కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు చెప్పారు. అయితే, ఈ కార్యక్రమాల తేదీలు ఇంకా ఖరారు కాలేదన్నారు.
నవంబర్ నెలలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు.
సోనియా గాంధీ ఆత్మకథను తాము స్వాగతిస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.




