మధిర డిపో ప్రత్యేక బస్సులు, NewzFast Telugu (మధిర, ఖమ్మం జిల్లా): కార్తీకమాసం సందర్భంగా శివాలయాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మధిర డిపో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని మధిర డిపో మేనేజర్ తడికమల్ల దేవరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
పంచారామాల యాత్ర కోసం 2026 నవంబర్ 15, 22, 29 తేదీలతో పాటు డిసెంబర్ 6వ తేదీన ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు మధిర నుంచి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలకు ప్రత్యేక డీలక్స్ బస్సులు నడపబడతాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ రిజర్వేషన్ కోసం సర్వీస్ నంబర్ 98927ను సంప్రదించవచ్చు.
అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 23వ తేదీన కూడా ప్రత్యేక డీలక్స్ బస్సు సౌకర్యం కల్పించనున్నారు. పంచారామాల దర్శనానికి పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,020 చార్జీలుగా నిర్ణయించారు.
అన్నవరం యాత్ర కోసం కూడా అదే తేదీల్లో ఆదివారాల రాత్రి 8 గంటలకు మధిర నుంచి ప్రత్యేక డీలక్స్ బస్సులు నడపబడతాయి. పెద్దలకు రూ.770, పిల్లలకు రూ.430 చార్జీలు వర్తిస్తాయి.
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం కూడా మధిర డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. 36 మంది ఒక బ్యాచ్‌గా వస్తే సూపర్ లగ్జరీ బస్సు, 40 మంది ఒక బ్యాచ్‌గా వస్తే డీలక్స్ బస్సు అందుబాటులో ఉంటుంది. ఇద్దరు మణికంఠ స్వాములకు, ఇద్దరు వంట మనుషులకు, ఒక సహాయకునికి సీట్లు లేకుండా ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తారు.
గురుస్వామి బస్సు బుక్ చేస్తే గురుస్వామికి ఉచిత ప్రయాణం ఉంటుంది.
భక్తుల కోరిక మేరకు శ్రీశైలం, వేదాద్రి, వేములవాడ, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ వంటి పుణ్యక్షేత్రాలకు 40 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే ఏ రోజైనా బస్సు సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు.
ముందస్తు రిజర్వేషన్ల కోసం 9908166892, 9866208233, 9908367066, 9959225961 నంబర్లను సంప్రదించాలని డిపో మేనేజర్ భక్తులు, ప్రయాణికులకు సూచించారు.




