బంగాళాఖాతంలో అల్పపీడనం, NewzFast Telugu (అమరావతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో రాబోయే శుక్రవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
ఈ అల్పపీడనం వాయవ్య దిశగా ప్రయాణించి, తర్వాతి 24 గంటల్లో మరింత బలపడి ‘సుస్పష్టమైన అల్పపీడనం’గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
దీని ప్రభావం వల్ల శనివారం, ఆదివారాల్లో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అలజడి నెలకొంటుందని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని APSDMA హెచ్చరించింది.
అయితే ఈ అల్పపీడనం ప్రభావం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌పై ఉండబోదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. తీరప్రాంత ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే తాజా సమాచారం కోసం అధికారుల సూచనలు గమనించాలని కోరింది.




