లోతుకుంట భూములపై స్టేటస్‌కో తొలగింపు, NewzFast Telugu (మల్కాజిగిరి మండలం, తెలంగాణ): మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామ సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూములపై హక్కులు నిర్ధారణ అయినందున, వాటిపై స్టేటస్‌కో కొనసాగించాలంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తొలగించింది.
కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఉద్యోగం నుంచి రిలీవ్ చేయాలని, ఆయన స్థానంలో అర్హులైన మరో వ్యక్తిని నియమించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టేను కొనసాగిస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ యారా రేణుక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
వివాదాస్పద ఆస్తి గుర్తింపుపై అభ్యంతరాలు ఉన్నాయని రంగనాథ్ తరఫు న్యాయవాది తెలిపారు. శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్స్ కంపెనీ తరఫు న్యాయవాది, సర్వే నంబర్లు 1, 2కు సంబంధించి సివిల్ కోర్టు, సుప్రీంకోర్టు నుంచి పిటిషనర్‌కు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని, ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు కొట్టివేసిందని వాదించారు.
భూమి పూర్వాపరాల్లోకి వెళ్లబోమని, కోర్టు ధిక్కరణ కేసులో రంగనాథ్‌ను తప్పించే అంశానికే పరిమితమవుతామని ధర్మాసనం పేర్కొంది. భూమి గుర్తింపునకు సంబంధించిన సర్వేపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోమని కూడా తెలిపింది.
అప్పీళ్లపై తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 20కి వాయిదా వేసింది.

