భూముల రీసర్వే, NewzFast Telugu (సిరిసిల్ల): భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల రీ సర్వే ప్రక్రియను ప్రారంభించిందని కలెక్టర్ తెలిపారు. మొదటి విడతలో చేపట్టిన 70 గ్రామాల్లో ఈనెల 30వ తేదీ వరకు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
భూముల రీ సర్వే కోసం అవసరమైన రోవర్ యంత్రాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని వివరించారు.
సర్వే చేపట్టనున్న గ్రామాలు, సర్వే నంబర్లు, తేదీల వివరాలను ముందుగానే వ్యవసాయ శాఖ అధికారులకు ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు సర్వే జరిగే గ్రామాల్లో రైతులు, పట్టాదారులకు సమాచారాన్ని స్పష్టంగా చేరవేయాలని స్పష్టం చేశారు.
భూముల రీ సర్వేను రైతుల సమక్షంలోనే నిర్వహించాలని, సర్వే పూర్తయిన తర్వాత రైతుల సంతకం తీసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్లు తమ మండలాల్లో జరుగుతున్న సర్వేను పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే కొనసాగించాలని, రోజుకు 60 నుంచి 100 ఎకరాల వరకు సర్వే చేయాలని తెలిపారు. ప్రతిరోజు సర్వే పూర్తయిన తర్వాత సంబంధిత రికార్డులను అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు.
ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తహసీల్దార్ల పర్యవేక్షణలో వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
భూముల రీ సర్వేపై రైతులు అవగాహన పెంచుకుని ప్రక్రియకు సహకరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కేఎస్బీ కుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు.




