లాలాగూడ మహిళా దొంగల ముఠా అరెస్ట్, NewzFast Telugu (హైదరాబాద్): ప్రజల దృష్టి మరల్చి బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న పాత మహిళా నేరస్తుల ముఠాను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురు మహిళల నుంచి మొత్తం 9.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మోసం ఎలా జరిగింది
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నవంబర్ 5 రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో ఓ మహిళ నార్త్ లాలాగూడలోని కూరగాయల మార్కెట్‌కు వెళ్లింది. అక్కడ 40 నుంచి 45 ఏళ్ల వయసున్న ఓ మహిళ ఆమెతో మాటలు కలిపి, అక్కడ పడివున్న ఓ పర్సును చూపించి అందులో విలువైన వస్తువులు ఉండవచ్చని నమ్మించింది.
ఇంతలో మరో మహిళ అక్కడికి వచ్చి తన పర్సు పోయిందంటూ వెతుకుతున్నట్లు నటించింది. పర్సులో ఐదు తులాల బంగారు బిస్కెట్ ఉందని చెప్పి, దానిని సమానంగా పంచుకుందామని బాధితురాలిని నమ్మించారు.
బిస్కెట్‌ను ఉదయం దుకాణంలో విక్రయిస్తామని చెబుతూ, బాధితురాలి మెడలోని రెండున్నర తులాల బంగారు చైనును తీసుకున్నారు.
మహిళలు వెళ్లిపోయిన తర్వాత వారు ఇచ్చిన మొబైల్ నంబర్ పనిచేయకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు లాలాగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దర్యాప్తు, అరెస్టులు
సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు నిందితులను పాత నేరస్తులుగా గుర్తించారు. నవంబర్ 13న లాలాపేట్ కల్లు దుకాణం వద్ద మరోసారి నేరానికి పాల్పడేందుకు వచ్చిన ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నేర చరిత్ర
- చెల్ల నర్సమ్మ (49), రాజేంద్రనగర్: రాజేంద్రనగర్, నార్సింగి, నిజామాబాద్, షామ్‌షాబాద్, నారాయణపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 18 కేసుల్లో అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు.
- వేముల లక్ష్మి (43), బోరబండ: సనత్‌నగర్, బాలానగర్, నిజామాబాద్, జగిత్యాల, నారాయణపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 17 కేసులు ఉన్నాయి.
- కొమెర అంజలి (45), గోల్కొండ వడ్డెర బస్తీ: యాదగిరిగుట్ట, ఉప్పల్, కుషాయిగూడ, లాలాగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
ఈ ముగ్గురు గతంలో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లారని, మార్చి 14, 2026న విడుదలైన తర్వాత మళ్లీ ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. యాదగిరిగుట్ట, ఉప్పల్, కుషాయిగూడ ప్రాంతాల్లోనూ ఇలాంటి చోరీలు చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.
స్వాధీనం, రిమాండ్
లాలాగూడ కేసుకు సంబంధించిన రెండున్నర తులాల బంగారు చైనుతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆభరణాలను కలిపి మొత్తం 9.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 13న నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు చంచల్‌గూడ మహిళా జైలుకు రిమాండ్‌పై తరలించారు.
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన లాలాగూడ ఇన్స్పెక్టర్ బి. రవికిరణ్, ఎస్ఐ కె.
మమత సహా క్రైమ్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. దర్యాప్తు డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అడిషనల్ డీసీపీ జె.
నర్సయ్య పర్యవేక్షణలో, చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి సూచనలతో జరిగినట్లు పోలీసులు తెలిపారు.




