కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫోటోలు వీడియోలు నిషేధం, NewzFast Telugu: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం, ప్రత్యక్ష ప్రసారం చేయడంపై నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ కువైట్ ప్రభుత్వం తాజా ఆంక్షలను ప్రకటించింది.
కువైట్ వార్తాపత్రిక అల్ ఖబాస్ కథనం ప్రకారం, కువైట్ సివిల్ ఏవియేషన్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ సాద్ అల్ ఉతైబీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు విమానాశ్రయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, వివిధ సంస్థల సిబ్బందికి వర్తిస్తాయని స్పష్టం చేశారు.
మొబైల్ ఫోన్లు, కెమెరాలతో వీడియోలు తీయడం, రికార్డ్ చేయడం, లైవ్ ప్రసారాలు నిర్వహించడం నిషేధమని పేర్కొన్నారు. రన్వేలు, ప్రయాణికుల టెర్మినళ్లు, పరిపాలనా భవనాలు, సాంకేతిక విభాగాలు సహా అన్ని ప్రాంతాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
విమానాశ్రయానికి సంబంధించిన అంతర్గత పత్రాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, భద్రతా విధానాలు, భద్రతా వ్యవస్థలు, తనిఖీ కేంద్రాలు, నిఘా కెమెరాల సమాచారాన్ని ఫోటో తీయడం లేదా ప్రచురించడం కూడా నిషేధించారు. విమానాశ్రయం, దాని అనుబంధ సౌకర్యాలు సున్నితమైనవని, కీలక మౌలిక సదుపాయాలు కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ అన్ని విభాగాలకు సూచించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కువైట్ చట్టాల ప్రకారం చర్యలు తప్పవని సర్క్యులర్‌లోని ఆర్టికల్ 2 స్పష్టం చేస్తోంది.

