కురుమూర్తి బ్రహ్మోత్సవాలు, NewzFast Telugu (మహబూబ్నగర్ జిల్లా, తెలంగాణ): శ్రీ కురుమూర్తి స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జాతర పరిసర ప్రాంతాల్లో కల్లు, మద్యం దుకాణాలను మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. జాతర ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
తెలంగాణ ఆబ్కారీ చట్టం–1968లోని సెక్షన్ 20(1) ప్రకారం నవంబర్ 10వ తేదీ ఉదయం 5 గంటల నుంచి నవంబర్ 25వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. కురుమూర్తి స్వామి జాతర ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలోని కల్లు దుకాణాలు, ఎ-4 మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు.
ఈ నిషేధం చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్, దుప్పల్లి, తిరుమలాపూర్, వడ్డెమాన్, అల్లిపూర్, కురుమూర్తి, అప్పంపల్లి, పేరూర్ గ్రామాలకు వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్, పోలీస్ అధికారులను ఆదేశించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భక్తులు, ప్రజలు, వ్యాపారులు అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.




