కుమ్రం భీం మనుమడు, NewzFast Telugu (కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా, పెద్దదోభ): ఆదివాసీ పోరాటయోధుడు కుమ్రం భీం రెండో మనుమడు కుమ్రం భీంరావు (55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ) మండలం పెద్దదోభ గ్రామంలో గ్రామస్థులను తీవ్ర దుఃఖంలో ముంచింది.
కుటుంబసభ్యుల కథనం ప్రకారం, భీంరావు ఈ నెల 7న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రం నుంచి తన స్వగ్రామం పెద్దదోభకు ఆటోలో ప్రయాణిస్తుండగా బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబసభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ దవాఖానకు తరలించారు.
మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి భీంరావు మృతి చెందారు. ఆయనకు భార్య అనసూయబాయి, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
కుమ్రం భీం కుమారుడు కుమ్రం మాధవరావు, బాగుబాయి దంపతులకు ముగ్గురు కుమారులు ఉండగా, వారిలో భీంరావు ఒకరు.
కుమ్రం భీం మరణానంతరం ఈ కుటుంబం పెద్దదోభలో స్థిరపడింది. గతంలో చిన్నవాడైన హన్మంతురావు అనారోగ్యంతో మృతి చెందగా, ఇప్పుడు భీంరావు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుటుంబం మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ కుటుంబాన్ని గుర్తించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, కుమ్రం భీం పేరిట ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు ఈ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపును ఇచ్చారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.




