కేటీఆర్ రాహుల్ గాంధీ విమర్శ, NewzFast Telugu (తెలంగాణ): తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని, ప్రజల సొమ్ముతో ప్రచార ఆర్భాటాలు చేయడం సిగ్గుచేటంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగ విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నప్పుడు, పోలీసుల చేతిలో దాడులకు గురవుతున్న సమయంలో రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. లగచర్లలో గిరిజన మహిళలపై దాడులు జరిగినప్పుడు, హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లను కూల్చివేస్తున్నప్పుడు ఢిల్లీలో నిద్రపోయారా అంటూ ఆయన మండిపడ్డారు.
కంచ గచ్చిబౌలి హెచ్సీయూ భూముల్లో వేలాది చెట్లను నరికివేసినప్పుడు, కేబీఆర్ పార్కు విధ్వంస సమయంలో రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని కేటీఆర్ నిలదీశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరుగుతున్నప్పుడు, అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసనసభ్యులపై దాడులు జరుగుతున్నప్పుడు కూడా ఆయన ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు.
రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులు, భూకబ్జాలపై రాహుల్ గాంధీ మౌనం వహించారని కేటీఆర్ ప్రశ్నించారు. సొంత మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడుతున్నా పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు.
ఇప్పుడు తెలంగాణ ప్రజల సొమ్ము రూ. 100 కోట్లు ఖర్చు పెట్టి కేవలం ప్రచార స్టంట్ల కోసం రాహుల్ గాంధీ రావడం సిగ్గుచేటని కేటీఆర్ విమర్శించారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవని నాయకులు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం వస్తున్నారంటూ ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.




