కొండమల్లేపల్లి, NewzFast Telugu (కొండమల్లేపల్లి): మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. మండలంలోని వివిధ శాఖల పనితీరు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సూపర్ ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, వ్యవసాయానికి సాగునీటి సమస్యలు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. అర్హత కలిగిన గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా, తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతుల విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇదే సమయంలో దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు శుభవార్తగా, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం మిర్యాలగూడకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు కొండమల్లేపల్లి పట్టణంలో ప్రస్తుత ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని ఆయన సూచించారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎంపీడీవో, మండల ప్రత్యేక అధికారి, మైనారిటీ ఏడీఏతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.




