కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ, NewzFast Telugu (కొల్లాపూర్): వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా రైతుల ప్రయోజనాల కోసం కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. గురువారం కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చైర్పర్సన్ పసుపుల షమీమ్, వైస్ చైర్మన్ పసుపుల నరసింహతో పాటు పాలకవర్గం సభ్యులచేత జిల్లా మార్కెటింగ్ అధికారి నరేందర్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని పాత మండలాల్లో కొత్తగా మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు మేలు జరగాలని స్పష్టం చేశారు.
మార్కెట్ కమిటీల్లో రైతులు తెచ్చిన ధాన్యం తూకాల్లోనూ, తరుగు పేరుతో దోపిడీకి గురికాకూడదని ఆయన అన్నారు. మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత మార్కెట్ కమిటీ పాలకవర్గానిదేనని మంత్రి చెప్పారు.
కరీంనగర్ జిల్లా ముల్కనూరు సింగిల్ విండో సొసైటీని పాలకవర్గం సందర్శిస్తే ఆదర్శంగా నిలుస్తారని కూడా ఆయన సూచించారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో రూ.400 కోట్ల వ్యయంతో అన్ని గ్రామాలకు బీటీ డబుల్ రోడ్లు మంజూరయ్యాయని, టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. ఈ రోడ్ల పనులు రానున్న ఏడాదిన్నర కాలంలో పూర్తవుతాయని తెలిపారు.
అలాగే మరో పది, పదిహేను రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు పాలకవర్గం నియామక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నూతన వైస్ చైర్మన్ పసుపుల నరసింహ మాట్లాడుతూ, దివంగత మాజీ మంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్ సమాజ సేవ, ఆదర్శ జీవితం, రాజకీయ వ్యవహారశైలి మంత్రి జూపల్లి కృష్ణారావులో ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలతో వేదికపై ఉన్న మంత్రి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.
మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం, కౌన్సిలర్లు, మాజీ జెడ్పీటీసీ హనుమంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




