కోల్‌కతా-ముంబై ఎయిర్ ఇండియా విమానం హైజాక్ బెదిరింపు, NewzFast Telugu (కోల్‌కతా): కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు.
ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 772 (ఎయిర్‌బస్ ఏ320 నియో) విమానం ఉదయం 10:20 గంటలకు కోల్‌కతా నుంచి ముంబై బయలుదేరాల్సి ఉంది. అయితే, టేకాఫ్‌కు కాసేపటి ముందు క్యాబిన్ సిబ్బంది విమానం వాష్‌రూమ్‌లో ఒక బెదిరింపు నోట్‌ను గుర్తించారు.
ఉదయం 11:10 గంటలకు విమానాన్ని హైజాక్ చేస్తామంటూ ఆ లేఖలో రాసి ఉంది.
వాష్‌రూమ్ అద్దంపై రాసి ఉందని కొందరు, కాగితంపై రాసిన నోట్ కనిపించిందని మరికొందరు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన క్యాబిన్ సిబ్బంది విషయాన్ని పైలట్‌కు తెలియజేశారు.
పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందిన వెంటనే విమానాశ్రయ భద్రతా విభాగం రంగంలోకి దిగింది. ప్రామాణిక భద్రతా నిబంధనల ప్రకారం విమానంలో ఉన్న సుమారు 93 మంది ప్రయాణికులను, ఐదుగురు సిబ్బందిని వెంటనే సురక్షితంగా కిందకు దించారు.
అనంతరం విమానాన్ని విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేకు తరలించారు.
ఈ ఘటనపై కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ స్పందిస్తూ వివరాలను ధ్రువీకరించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సహా ఇతర భద్రతా సంస్థలు విమానంతో పాటు ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.
ఈ బెదిరింపు సందేశాన్ని ఎవరు రాశారనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.




