కియా పెనుకొండ ప్లాంట్ విస్తరణ, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో కియా కార్పొరేషన్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగ్ లీ సమక్షంలో ఎంఓయూ చేసుకున్నారు.
పెనుకొండలో మరో ప్లాంట్ ఏర్పాటుకు కియా సంస్థ రూ.19 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా కొత్తగా 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
ప్రస్తుతం పెనుకొండ ప్లాంట్ నుంచి ఏటా 4.3 లక్షల కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. తాజా ఒప్పందంతో అదనంగా ఏటా 2 లక్షల కార్ల ఉత్పత్తి జరగనుంది.
దీంతో మొత్తం ఉత్పత్తి సామర్థ్యం ఏటా 6.3 లక్షల కార్లకు చేరుతుంది.
ఆంధ్రప్రదేశ్ యూనిట్‌లో తయారైన మేడ్ ఇన్ ఏపీ కార్లను ప్రస్తుతం 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. సత్యసాయి జిల్లా ఎర్రమంచిలో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు కూడా కియా సంస్థ ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందంపై ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి, కియా కార్పొరేషన్ సీఈఓ సంతకాలు చేశారు.
ఒప్పందం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, కియా సంస్థను రాష్ట్రానికి తీసుకురావడానికి విస్తృత ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీరు అందించడం, జాతీయ రహదారి, బెంగళూరు ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ కల్పించడం వంటి సహకారాన్ని ప్రస్తావించారు.
కేవలం 14 నెలల్లోనే ప్లాంట్ నిర్మాణం పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.
పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతా ద్వారా అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పెట్టుబడుల రక్షణ కోసం ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్టును తీసుకువస్తున్నట్లు కూడా వెల్లడించారు. 2029 మే నాటికే రెండో ప్లాంట్ పూర్తి చేయాలని కియా యాజమాన్యాన్ని కోరినట్లు ఆయన చెప్పారు.




