ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026, NewzFast Telugu (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా, దేశం గర్వించే రీతిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను నిర్వహించాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.
బేగంపేటలోని టూరిస్ట్ ప్లాజాలో ఖేలో ఇండియా ఏర్పాట్లపై వివిధ జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, క్రీడాశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ప్రత్యేక సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ కృషితోనే ఈ క్రీడల నిర్వహణ అవకాశం తెలంగాణకు దక్కిందని పేర్కొన్నారు.
నేటి యువతరం సోషల్ మీడియా రీల్స్, బెట్టింగ్ వంటి వ్యసనాల బారిన పడి సమయాన్ని వృథా చేసుకుంటున్నదని మంత్రి శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. వారిని ఈ వ్యసనాల నుంచి బయటకు తీసుకువచ్చి మైదానాల వైపు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.
ఖేలో ఇండియా నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.203 కోట్లను వెచ్చిస్తున్నదని, అందులో రూ.120 కోట్లతో క్రీడా మౌలిక వసతులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామని స్పెషల్ సీఎస్ వాణీ ప్రసాద్ వెల్లడించారు.




