ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లు, NewzFast Telugu (తెలంగాణ): డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాల లోపం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు ఉపయోగిస్తున్న వనరులను ఖేలో ఇండియా పోటీలకు సమాంతరంగా వినియోగించుకోవాలని సూచించారు.
క్రీడా ప్రాంగణాలను శాశ్వత ప్రాతిపదికన అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని, పోటీల తర్వాత కూడా అవి క్రీడా వనరులుగా ఉపయోగపడేలా చూడాలని సీఎం అన్నారు. గ్రూప్-1 స్థాయి అధికారులకు ఏర్పాట్ల నుంచి పోటీలు ముగిసే వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు.
ఈ పోటీలకు దేశవ్యాప్తంగా ఏడు వేలకు పైగా యువ క్రీడాకారులు, సుమారు రెండు వేల మంది కోచింగ్ సిబ్బంది, అధికారులు రానున్నారు. హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో 20 చోట్ల 27 రకాల క్రీడా పోటీలు, ఒక డెమో పోటీ నిర్వహించనున్నారు.
క్రీడాకారులకు ఆహారం, వసతి సౌకర్యాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ప్రారంభ, ముగింపు వేడుకల్లో అనవసర ఆడంబరాలకు తావివ్వరాదని కూడా సీఎం సూచించారు. తెలంగాణ కర్రసాము క్రీడను ఆతిథ్య రాష్ట్ర కోటాలో ఖేలో ఇండియా క్రీడల్లో చేర్చేందుకు వెంటనే కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.
గత ప్రభుత్వ హయాంలో క్రీడా మౌలిక సదుపాయాలు కొన్నేళ్లలోనే దెబ్బతిన్నాయని గుర్తు చేస్తూ, ఈసారి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

