కార్వేటినగరం హత్య, NewzFast Telugu (చిత్తూరు జిల్లా, కార్వేటినగరం): చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో ఒక కారు వివాదం హత్యకు దారితీసింది. మధ్యవర్తిత్వం చేసిన వ్యక్తే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
కార్వేటినగరం మండలం తురకమిట్టకు చెందిన యుగంధర్‌కు, అదే మండలం కేఎం పురానికి చెందిన ప్రదీప్ రాజు కుటుంబంతో స్నేహం ఉంది. ఈ పరిచయంతో యుగంధర్ తనకు తెలిసిన వ్యక్తి ద్వారా ప్రదీప్ రాజుకు కారును అద్దెకు ఇప్పించాడు.
అయితే అద్దెకు తీసుకున్న కారుతో ప్రదీప్ రాజు కుటుంబం ప్రమాదానికి గురైంది.
ఆ తర్వాత కారును తిరిగి ఇవ్వకపోవడంతో పాటు రూ.3 లక్షల అద్దె బకాయిలు చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో యుగంధర్ ప్రదీప్ రాజును నిలదీయగా ఇద్దరి మధ్య వివాదం మొదలై క్రమంగా పెద్దదైంది.
ఈ నెల 9న యుగంధర్ ప్రదీప్ రాజుకు సన్నిహితుడైన లీలా కుమార్‌ను కలిసి విషయాన్ని వివరించాడు.
ఈ విషయం తెలుసుకున్న ప్రదీప్ రాజు కుటుంబ సభ్యులు అదే రోజు యుగంధర్‌తో గొడవకు దిగారు. దీంతో యుగంధర్ తన స్నేహితుడు ప్రభుదాస్‌తో కలిసి కార్వేటినగరం పోలీసులను ఆశ్రయించి ప్రదీప్ రాజు కుటుంబంపై ఫిర్యాదు చేశాడు.
పోలీసులు ప్రదీప్ రాజుకు ఫోన్ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు.
పోలీసుల నుంచి సమాచారం అందిన తర్వాత ప్రదీప్ రాజు కుటుంబ సభ్యులు యుగంధర్‌పై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ నుంచి బైక్‌పై తిరిగి వస్తున్న యుగంధర్, ప్రభుదాస్‌ను కారుతో ఢీకొట్టగా యుగంధర్ మృతి చెందాడు.
ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో హత్య కోణం వెలుగులోకి రావడంతో ప్రదీప్ రాజు, అతని సోదరుడు దిలీప్ రాజు, స్నేహితుడు లీలా కుమార్, తల్లి విజయలక్ష్మిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరో నిందితుడు రవికుమార్ రాజు పరారీలో ఉన్నాడు.
కుమారుడిని కోల్పోయిన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తే ఇలాంటి ఘోరానికి బలికావడం ప్రాంతంలో కలకలం రేపుతోంది.




