మండి షావర్మా ఆహార భద్రత తనిఖీ, NewzFast Telugu (కరీంనగర్): కరీంనగర్ జిల్లాలోని మండి, షావర్మా రెస్టారెంట్లపై ఆహార భద్రత విభాగం అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే రా ఎగ్ మయోనైజ్ తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ తనిఖీల్లో షావర్మా కార్నర్ (ఐబీ చౌరస్తా సమీపంలో), క్వాలిటీ మండి (గీతా భవన్ చౌరస్తా సమీపంలో), అరేబియన్ కిచెన్ (ముకరంపుర), కోయ్ మండి (బ్యాంక్ కాలనీ సమీపంలో) రెస్టారెంట్లను అధికారులు పరిశీలించారు. నాలుగు రెస్టారెంట్లలోనూ రా ఎగ్ మయోనైజ్ వినియోగం గుర్తించలేదని, వెజ్ మయోనైజ్ వాడుతున్నట్లు అధికారులు నిర్ధారించారు.
అయితే అరేబియన్ కిచెన్, క్వాలిటీ మండి రెస్టారెంట్లలో వంటగది నిర్వహణలో పలు లోపాలు బయటపడ్డాయి. వంటగదుల్లో పరిశుభ్రత పాటించకపోవడం, వెజ్, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను ఒకే ఫ్రీజర్‌లో నిల్వ చేయడం వంటివి గుర్తించారు.
వెన్నకు బదులుగా డెలీషియస్ ఫ్యాట్ స్ప్రెడ్ వినియోగించడం, ఎగ్జాస్ట్ ఫ్యాన్లపై వంట నూనె, కొవ్వు పేరుకుపోవడం కూడా ఉల్లంఘనలుగా నమోదయ్యాయి.
కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల కటింగ్‌కు ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు ఉపయోగిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. క్వాలిటీ మండి రెస్టారెంట్‌లో చికెన్ వంటకాల తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు తేలింది.
ఈ రంగులతో తయారు చేసిన సుమారు 10 కిలోల చికెన్‌ను అక్కడికక్కడే పారవేశారు.
ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన హోటళ్ల నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు కేసులు నమోదు చేశారు. తదుపరి చట్టపరమైన చర్యలు FSSAI నిబంధనల ప్రకారం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రతి రెస్టారెంట్‌లో వంటగదులను పరిశుభ్రంగా ఉంచాలని, వెజ్, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేయాలని, అనుమతించిన ఫుడ్ కలర్స్ మాత్రమే వినియోగించాలని సూచించారు.
ఈ తనిఖీల్లో గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పి. రోహిత్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వి.
అంకిత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్ల తనిఖీలు కొనసాగుతాయని ఆహార భద్రత విభాగం వెల్లడించింది.




