కంగ్టి రోడ్డు ప్రమాదం, NewzFast Telugu (మెదక్ జిల్లా, తెలంగాణ): మెదక్ జిల్లా కంగ్టి మండలం దేగుల్వాడి గ్రామానికి చెందిన 70 ఏళ్ల నల్చార్ గోవింద్ రెడ్డి ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం సుమారు 10:40 గంటల సమయంలో దేగుల్వాడి గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది.
గోవింద్ రెడ్డి పంటకు పిచికారీ చేయడానికి మందులు, ఇంటికి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి కంగ్టికి వచ్చారు. పనులు ముగించుకుని తన వాహనంపై గ్రామానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
వరంగల్ నుంచి మహారాష్ట్రలోని లాతూర్ వైపు వెళ్తున్న బొలేరో వాహనం (MH24BW1244) అతివేగంగా వచ్చి ఆయన వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత వాహనం సుమారు 70 నుంచి 80 మీటర్ల వరకు ఆయనను ఈడ్చుకెళ్లడంతో గోవింద్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.
మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.




