కళ్లం పేరిరెడ్డి, NewzFast Telugu (విశాఖపట్నం): బ్యాంక్ రుణాలు పొంది నిధులను మళ్లించిన కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విశాఖపట్నం సబ్ జోనల్ కార్యాలయం కఠిన చర్యలకు దిగింది. కళ్లం మోడర్న్ రైస్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసుకు సంబంధించి కళ్లం పేరిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, సహచరులకు చెందిన రూ.18.33 కోట్ల విలువైన స్థిరాస్తులను మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద తాత్కాలికంగా జప్తు చేసింది.
చెన్నై సీబీఐ-ఈఓడబ్ల్యూ వద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గుంటూరు బ్రాంచ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ విచారణను ప్రారంభించింది. కళ్లం మోడర్న్ రైస్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ రామాబ్రహ్మ మోడర్న్ రైస్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, M/s శ్రీ వినాయక ట్రేడర్స్ తదితర సంస్థలు 2010-2013 మధ్య కాలంలో నకిలీ, ఫోర్జరీ టైటిల్ డీడ్లను సెక్యూరిటీగా సమర్పించి గుంటూరు అరండల్పేట ఎస్బీహెచ్ బ్రాంచ్ నుంచి రూ.24.57 కోట్ల అప్పును పొందాయి.
అయితే, అవే నిధులను ఇతర అవసరాలకు మళ్లించి బ్యాంకుకు రూ.18.33 కోట్ల నష్టాన్ని కలిగించాయని ఆరోపణలు ఉన్నాయి.
ఈడీ దర్యాప్తులో కళ్లం పేరిరెడ్డి తన బంధువులు, ఉద్యోగులు, అనుచరుల పేర్లపై నమోదైన దాదాపు 26 సంస్థలను నిర్వహించినట్లు తేలింది. రుణాలు పొందిన 3 ప్రధాన సంస్థల క్యాష్ క్రెడిట్ ఖాతాల నుంచి కార్మికులు, అకౌంటెంట్లు, పేరిరెడ్డి స్వయంగా రూ.23.81 కోట్ల నగదును విత్డ్రా చేసినట్లు బ్యాంక్ ఖాతాల పరిశీలనలో బయటపడింది.
బ్యాంక్ రుణాల ద్వారా వచ్చిన నిధులు, విత్డ్రా చేసిన నగదుతో పలు ఆస్తులను కొనుగోలు చేసినట్లు విచారణలో పేర్కొన్నారు.
అంతేకాకుండా, పేరిరెడ్డి కొన్ని స్థిరాస్తులను ఎలాంటి క్రయవిక్రయ నగదు అందుకోకుండానే తన బంధువులు, సహచరుల పేర్లకు బదిలీ చేశారని, వారు కేవలం నామమాత్రపు యజమానులుగా ఉన్నారని, అసలు లబ్ధిదారుడు పేరిరెడ్డేనని విచారణలో తేలినట్లు ఈడీ పేర్కొంది. ఈ విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న రూ.16.88 కోట్ల విలువైన 50 స్థిరాస్తులు, రూ.1.45 కోట్ల విలువైన 5 ఫ్లాట్లను PMLA కింద తాత్కాలికంగా అటాచ్ చేసింది.
ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోందని ఈడీ అధికారులు ప్రకటించారు.




