జనసేన తెలంగాణ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, NewzFast Telugu (హైదరాబాద్): తెలంగాణలో జనసేన పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. 2029 సాధారణ ఎన్నికలతో పాటు అంతకుముందు జరగనున్న స్థానిక సంస్థలు, మున్సిపల్, కార్పొరేషన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పోటీ చేయడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ తెలిపింది.
ఇందులో భాగంగా 2026 జూన్ 2వ తేదీకి ముందు నియమించిన పలు పదవులు, కమిటీలను రద్దు చేస్తున్నట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రకటించింది. పార్లమెంట్, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్ పదవులతో పాటు జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఇన్చార్జ్ పదవులు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ (పీఓసీ) బాధ్యతలను రద్దు చేసింది.
విద్యార్థి, యువజన, వీర మహిళ విభాగాల పదవులు, పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నియమించిన కోఆర్డినేటర్ల బాధ్యతలు కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది. పాత, కొత్త అడహక్ కమిటీలకూ ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
అయితే 2026 జూన్ 2 తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ, అధికార ప్రతినిధులు యథావిధిగా కొనసాగుతారని తెలిపింది. రాష్ట్ర ముఖ్య నాయకుల పదవులకు ఈ రద్దు వర్తించదని పేర్కొంది.
పార్టీని కేవలం పదవులు, హోదాలకే పరిమితం చేయకుండా ప్రజాక్షేత్రంలో నిరంతరం పనిచేసే రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే పునర్వ్యవస్థీకరణ ప్రధాన ఉద్దేశమని జనసేన వెల్లడించింది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
యువత, విద్యార్థులు, విద్యావంతులు, మహిళలు, అనుభవజ్ఞులు, మేధావులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొంది.
పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచనలు, సూచనలు, భవిష్యత్ కార్యాచరణకు అనుగుణంగా తెలంగాణలో కొత్త వ్యవస్థను రూపొందించనున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకులు, జనసైనికులు, వీర మహిళల వివరాలను సేకరించి, సమష్టిగా చర్చించిన అనంతరం కొత్త కమిటీలపై నిర్ణయం తీసుకోనున్నారు.
గతంలో పార్టీ పదవుల్లో పనిచేసిన వారి బాధ్యతలు రద్దు కావడం వారి సేవలకు ముగింపు కాదని జనసేన స్పష్టం చేసింది. మరింత క్రమబద్ధమైన, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సమస్యలపై పోరాట స్ఫూర్తిని తెలంగాణలో మరింత విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యమని పేర్కొంది.




