జనగణనలో కులరహితులు, NewzFast Telugu (హైదరాబాద్): కులాల వారీగా జనాభా లెక్కలు సేకరిస్తున్నప్పుడు కులవ్యవస్థను తిరస్కరించే కులరహితులకు, మత విశ్వాసాలకు అతీతంగా జీవించే మతరహితులకు జనగణనలో చోటు ఎందుకు కల్పించడం లేదని కుల నిర్మూలన సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2027లో నిర్వహించనున్న జనగణనలో ‘నో కాస్ట్’ (No Caste), ‘నో రిలీజియన్’ (No Religion) పేరుతో రెండు ప్రత్యేక కాలమ్స్ ఏర్పాటు చేసి, వారి జనాభాను అధికారికంగా నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
కుల గణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే కులాన్ని స్వచ్ఛందంగా తిరస్కరించే పౌరుల అస్తిత్వాన్ని విస్మరించడం సమంజసం కాదని సంఘం పేర్కొంది. కులం, మతం అనే గుర్తింపులను అంగీకరించని వారిని బలవంతంగా ఏదో ఒక కులం లేదా మతం పరిధిలో నమోదు చేయడం వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేసింది.
ఈ డిమాండ్‌పై గత రెండేళ్లుగా ఉద్యమిస్తున్నామని కుల నిర్మూలన సంఘం తెలిపింది. గతేడాది ఢిల్లీకి వెళ్లిన ప్రతినిధి బృందం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి, రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్‌కు వినతిపత్రాలు సమర్పించింది.
తెలంగాణలోనూ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్‌కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది.
ఈ వినతులకు స్పందించిన సంబంధిత కార్యాలయాలు జనగణనలో కులాల వారీగా వివరాలు నమోదు చేస్తామని సమాధానమిచ్చాయని, అయితే కులరహితులు, మతరహితుల అంశంపై స్పష్టత ఇవ్వలేదని సంఘం తెలిపింది. రిమైండర్ లేఖలకు కూడా స్పందన లేకపోవడంతో న్యాయపోరాటానికి దిగినట్లు పేర్కొంది.
ఈ అంశంపై హైకోర్టులో W.P. No. 30829/2024తో పాటు న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు వివరించింది.
తెలంగాణలో సాధ్యమైంది.. దేశవ్యాప్తంగా ఎందుకు కాదు?
కులరహితులు, మతరహితుల వివరాల నమోదు ఆచరణలో సాధ్యమేనని తెలంగాణ సామాజిక, కుల గణన సర్వే నిరూపించిందని సంఘం పేర్కొంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తమ న్యాయపోరాటం, హైకోర్టు మధ్యంతర ఆదేశాల ఫలితంగా ఈ వివరాల నమోదుకు అవకాశం కల్పించారని తెలిపింది.
ఆ సర్వేలో కులరహితులకు ‘999’, మతరహితులకు ‘01’ కోడ్ కేటాయించగా, కులాంతర వివాహాల వివరాలను 55వ కాలమ్‌లో నమోదు చేసినట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం సుమారు 12 లక్షల మంది, అంటే రాష్ట్ర జనాభాలో 3.4 శాతం మంది తమను కులరహితులుగా ప్రకటించుకున్నారని పేర్కొంది.
కులవ్యవస్థను తిరస్కరిస్తూ సమానత్వం, మానవత్వం ఆధారంగా జీవించాలనుకునే ప్రజలు గణనీయ సంఖ్యలో ఉన్నారనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని అభిప్రాయపడింది.
గెజిట్‌లో రెండు అంశాలు.. కానీ ప్రత్యేక గుర్తింపు లేదు
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 14న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో జనగణన సందర్భంగా సేకరించనున్న 40 అంశాలను పేర్కొందని సంఘం తెలిపింది. ఇందులో 9వ అంశంగా మతం, 10వ అంశంగా కులం (ఎస్సీ, ఎస్టీ, ఇతర కులాలు) వివరాల నమోదు ఉన్నప్పటికీ, కులరహితులు, మతరహితుల కోసం ప్రత్యేక ఎంపికలు లేవని అభ్యంతరం వ్యక్తం చేసింది.
అక్టోబర్ 30న విడుదలైన గెజిట్ ప్రకారం 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన నిర్వహించనున్నారని, జనవరి 10 నుంచి 24 వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించారని గుర్తుచేసింది. ఈ ప్రక్రియలోనూ ‘నో కాస్ట్–నో రిలీజియన్’కు చోటు కల్పించలేదని పేర్కొంది.
రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు గుర్తింపు ఇవ్వాలి
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మతాన్ని ఆచరించే స్వేచ్ఛతోపాటు, ఏ మతాన్నీ అనుసరించకుండా ఉండే వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా గుర్తింపు ఉందని సంఘం పేర్కొంది. కులాన్ని ప్రకటించుకునే హక్కు ఉన్నట్లే, కుల గుర్తింపును తిరస్కరించే హక్కుకూ గౌరవం ఇవ్వాలని కోరింది.
జనగణన కేవలం కులాలు, మతాల వారీగా జనాభాను లెక్కించే ప్రక్రియగా కాకుండా సమాజంలోని భిన్న అస్తిత్వాలను ప్రతిబింబించేలా ఉండాలని అభిప్రాయపడింది. కులరహిత సమాజ నిర్మాణం దిశగా ప్రభుత్వ గణాంకాల్లోనూ కులరహితులు, మతరహితులకు ప్రత్యేక గుర్తింపు కల్పించడం అవసరమని కుల నిర్మూలన సంఘం స్పష్టం చేసింది.
ఈ సమావేశంలో సంఘం గౌరవ సలహాదారులు సి.ఎల్.ఎన్. గాంధీ, అధ్యక్షుడు వహీద్, ఉపాధ్యక్షులు జ్యోతి, సూర్య నారాయణ, ప్రధాన కార్యదర్శి కృష్ణ చంద్ తదితరులు పాల్గొన్నారు.
వీరితో పాటు డి.వి. రామకృష్ణ, అడ్వకేట్ సురేష్ కుమార్, కార్యవర్గ సభ్యులు గ్రేస్, ప్రభాకర్, రఫి, ఈశ్వర్ లింగం, సూర్య సుధ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘం భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.




