జైపూర్ స్కూల్ బ్యాగులు పంపిణీ, NewzFast Telugu (జైపూర్): జైపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.
కాకా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు 320 స్కూల్ బ్యాగులను ఆయన అందజేశారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
భోజనం నాణ్యత, రుచి ఎలా ఉన్నాయో విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఉదయం అందించే అల్పాహారం గురించి కూడా విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
విద్యారంగ అభివృద్ధికి తమ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.
విద్య ఉంటేనే ఏదైనా సాధించవచ్చని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. తమ తాతగారు ‘కాకా’ వెంకటస్వామి నాటి నుంచి కుటుంబం విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని గుర్తుచేశారు.
తాత అడుగుజాడల్లోనే తన తండ్రి వివేక్ వెంకటస్వామి, తాను కూడా విద్యారంగ బలోపేతం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.
చెన్నూరు నియోజకవర్గంలో విద్యార్థుల చదువుల కోసం ఇప్పటివరకు మంత్రి వివేక్ వెంకటస్వామి 10 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. అలాగే సోమనపల్లి గ్రామం వద్ద సుమారు 200 కోట్ల రూపాయలతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ నిర్మాణం జరుగుతోందని, త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు.
ఈ పాఠశాల పూర్తయితే సుమారు 2000 మంది విద్యార్థులకు అత్యుత్తమ వసతులతో కూడిన ఉచిత విద్య అందుతుందని ఆయన చెప్పారు. విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లి కృషి చేస్తామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.




