ఐటీడీపీ వైఎస్సార్సీపీ, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఐటీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీలు కీలక ప్రకటనలు విడుదల చేశాయి.
వ్యక్తిగత విషయాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని ఇరు పార్టీలు తమ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులకు సూచించాయి. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన చర్చల మధ్య స్పష్టమైన హద్దులు పాటించాలని పిలుపునిచ్చాయి.
ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి.
కూటమి పార్టీల నాయకులతో పాటు వైఎస్సార్సీపీ నేతల వ్యక్తిగత జీవితాలపై ఎవరైనా వ్యాఖ్యలు చేయడం, చర్చలు జరపడం ఆమోదయోగ్యం కాదని ఐటీడీపీ తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఐటీడీపీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు దృష్టికి వస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వ్యక్తిగతంగా వెల్లడించే అభిప్రాయాలకు, ఇతరులు చేసే అవమానకర వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.
మరోవైపు వైఎస్సార్సీపీ కూడా ఇదే అంశంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వ్యాఖ్యలు, చర్చలు వివిధ సోషల్ మీడియా వేదికల్లో కనిపిస్తున్నాయని పేర్కొంది.
ఇవి పూర్తిగా వ్యక్తిగత విషయాలు కావడంతో సంబంధిత వ్యక్తుల గోప్యతను గౌరవించాలని సూచించింది.
వైఎస్సార్సీపీ తమ నాయకులు, అధికార ప్రతినిధులు, కార్యకర్తలకు నాలుగు కీలక సూచనలు చేసింది. వ్యక్తిగత విషయాలపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు లేదా ప్రకటనలు చేయకూడదని, సోషల్ మీడియా చర్చలకు దూరంగా ఉండాలని కోరింది.
వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయడం లేదా ప్రచారం చేయడం మానుకోవాలని, అన్ని బహిరంగ సంభాషణల్లో గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన వైఖరిని కొనసాగించాలని సూచించింది.
ఒకవైపు ఐటీడీపీ క్రమశిక్షణా చర్యల హెచ్చరికలు, మరోవైపు వైఎస్సార్సీపీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడంతో రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల సమయంలో వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించకూడదన్న సందేశం ఇరు పార్టీల ప్రకటనల్లో కనిపిస్తోంది. ఈ పరిణామంతో సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు, అనుచిత పోస్టుల విషయంలో పార్టీల వైఖరి చర్చనీయాంశంగా మారింది.
గతంలో నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించిన ఘటనలు ఏపీ రాజకీయాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. ఈ ప్రకటనలు ఎంతవరకు ఆచరణలోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.




