సాగునీరు, NewzFast Telugu (భూపాలపల్లి, తెలంగాణ): పంటలకు సాగునీరివ్వాలని రైతులు కోరితే క్రిమినల్ కేసులు పెడతామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.
మంథనిలో ఐదు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా, భూపాలపల్లిలో ఒక్క మండలాన్ని మాత్రమే ప్రకటించడంపై ఎమ్మెల్యే నోరు మెదపకపోగా, కేసుల పేరుతో రైతులను బెదిరించడం సరికాదని ఆయన అన్నారు. మంగళవారం భూపాలపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పించుకొని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.
వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదని ఆరోపించారు. మూడేండ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
రాష్ట్రంలో కృత్రిమ కరువు పరిస్థితులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు.
మేడిగడ్డ బరాజ్‌లో దెబ్బతిన్న రెండు పిల్లర్లకు మరమ్మతు చేయించలేని ప్రభుత్వమని విమర్శించారు. గణపురం చెరువును పూర్తిస్థాయిలో నింపి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని, చలివాగు ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించాలని డిమాండ్ చేశారు.
దేవాదుల ఎత్తిపోతల పథకం మోటర్లను ఉదయం ప్రారంభించి రాత్రికి నిలిపివేస్తుండటంతో రైతులకు సాగునీరు అందడం లేదని ఆయన పేర్కొన్నారు. మోటర్లను నిరంతరంగా నడిపిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరువు సమస్య ఉండదని సూచించారు.




