ఇరిగేషన్ ఇంజినీర్ అక్రమాస్తులు, NewzFast Telugu (తెలంగాణ): తెలంగాణలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇరిగేషన్ అండ్ CAD శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రాగిరి సత్యనారాయణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.
అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) గురువారం (నవంబర్ 12) ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర అనుచరులకు సంబంధించిన మొత్తం 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా కర్మన్‌ఘాట్‌లోని మదవరమ్ సెరెనిటీ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆయన నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో భారీగా అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో 342 చదరపు గజాల స్థలంలో నిర్మించిన 5,200 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ట్రిప్లెక్స్ విల్లాను అధికారులు గుర్తించారు.
అలాగే కర్మన్‌ఘాట్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో 3BHK అపార్ట్‌మెంట్, నాగోల్‌లోని రాక్ టౌన్‌లో 2BHK ఫ్లాట్‌ను గుర్తించారు.
వనపర్తి జిల్లా షాపూర్ గ్రామంలో 25 ఎకరాల వ్యవసాయ భూమి, నాగర్‌కర్నూల్‌లో తొమ్మిది ఓపెన్ ప్లాట్లు, షాపూర్ గ్రామంలో ఒక ఫామ్‌హౌస్ ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు సుమారు 50 తులాల బంగారు ఆభరణాలు, 2.8 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే మహీంద్రా XUV 7XO, మహీంద్రా థార్, మారుతి సెలెరియో, హ్యుందాయ్ శాంట్రో, బొలెరో వంటి ఐదు వాహనాలను గుర్తించారు.
ప్రాథమికంగా గుర్తించిన స్థిర, చరాస్తుల డాక్యుమెంట్ విలువ మొత్తం రూ.7,32,66,581గా ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. అయితే వీటి మార్కెట్ విలువ డాక్యుమెంట్ విలువ కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం 1988 (2018 సవరణ)లోని సెక్షన్లు 13(1)(b), 13(2) కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ఆయనకు సంబంధించిన మరిన్ని ఆస్తుల వివరాలను గుర్తించేందుకు అధికారులు అదనపు తనిఖీలు, ధ్రువీకరణ చేపడుతున్నారు.
ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని ఏసీబీ వెల్లడించింది.




