ఐపీఎల్ విస్తరణ, NewzFast Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2028 మెగా వేలానికి ముందు లీగ్‌ను 12 జట్లకు విస్తరించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం పుణె, వడోదర నగరాలను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.
అయితే ఈ విషయంపై బోర్డు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉందని జాతీయ మీడియా పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు ఫ్రాంచైజీల విలువ భారీగా పెరగడంతో కొత్త జట్ల ఏర్పాటుపై పెట్టుబడిదారుల్లో ఆసక్తి నెలకొంది. కొత్త ఫ్రాంచైజీ విలువ ఒక్కొక్కటి సుమారు రూ.8,800 కోట్లు ఉండవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఐపీఎల్ 2028 మెగా వేలానికి ముందు తదుపరి మీడియా హక్కుల ఒప్పందం జరగనుంది. ఈ నేపథ్యంలోనే విస్తరణకు ప్రాధాన్యం ఏర్పడింది.
లీగ్ మ్యాచ్‌లను పెంచాలని, జనవరి నుంచే మ్యాచ్‌లు నిర్వహించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది. రెండు దశల్లో ఐపీఎల్ నిర్వహించాలనే సలహాలు కూడా వస్తున్నాయి.
కొత్త జట్లను కొనుగోలు చేసేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ పెర్మిరా, ఆసియా ప్రభుత్వ పెట్టుబడి సంస్థలు, అమెరికాకు చెందిన ఫ్యామిలీ ఆఫీసులు, పశ్చిమాసియా సావరిన్ వెల్త్ ఫండ్స్, భారతీయ పారిశ్రామిక సంస్థలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
కొందరు అత్యంత సంపన్నులు మైనారిటీ వాటాల రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పుణె నగరానికి ఇప్పటికే ఐపీఎల్‌తో అనుబంధం ఉంది. 2011 నుంచి 2013 వరకు పుణె వారియర్స్ ఇండియా జట్టు ఐపీఎల్‌లో భాగంగా ఉంది. ఆర్థిక వివాదాల కారణంగా ఆ జట్టు ఐపీఎల్ నుంచి తప్పుకుంది.
ఆ తర్వాత 2016, 2017 సీజన్లలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు బరిలోకి దిగింది. 2017లో ఫైనల్‌కు చేరిన ఆ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.
గుజరాత్ రాష్ట్రాన్ని ఆధారంగా చేసుకుని గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఉన్నప్పటికీ, వడోదర వేదికగా మరో జట్టును ఏర్పాటు చేయాలనే యోచనలో క్రికెట్ పెద్దలు ఉన్నట్లు సమాచారం. బీసీసీఐ పాలక వర్గంలో గుజరాత్ ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతోనే ఆ నగరాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్తగా రెండు జట్లు వస్తే టీమ్‌ల సంఖ్య 12కు చేరుతుంది. అయితే లీగ్ నాణ్యత తగ్గే అవకాశం ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.




