ఇడుపు కాయితం, NewzFast Telugu: టాలీవుడ్లో విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రియదర్శి మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ నుంచి మేకర్స్ తాజాగా టీజర్ విడుదల చేశారు.
టైటిల్ ప్రకటనతోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా టీజర్ ఇప్పుడు మరింత దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రేమ, పెళ్లి, కుటుంబ అనుబంధాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వంటి అంశాలను వినోదాత్మకంగా టీజర్ చూపిస్తోంది. ముఖ్యంగా పెళ్లితో మొదలైన కథ చివరకు విడాకుల పత్రం దగ్గరకు చేరడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
టీజర్ ప్రారంభంలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ‘రామాయణం ఎక్కడ ఆగిపోతుంది అనుకుంటామో.. అక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది’ అనే మాటలు వస్తాయి.
ఈ డైలాగ్ ద్వారా కథలో శ్రీలత పాత్రకు ఉన్న ప్రాధాన్యతను సూచించే ప్రయత్నం జరిగింది.
ఆ తర్వాత ప్రేమ, కామెడీ, పెళ్లి, కుటుంబ భావోద్వేగాలతో కథను పరిచయం చేశారు. గ్రామీణ వాతావరణం, సహజమైన సంభాషణలు టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ చిత్రంలో ప్రియదర్శి శ్రీను పాత్రలో, నాగదుర్గ శ్రీలత పాత్రలో నటిస్తున్నారు. వారి పరిచయం, ప్రేమ, పెళ్లి చూపులు, వివాహం వంటి సన్నివేశాలను సరదాగా చూపించారు.
పెళ్లి తర్వాత కొత్త జంట జీవితంలోని చిన్న చిన్న సంఘటనలు, అలకలు, కుటుంబ సభ్యులతో అనుబంధాలు, భార్యాభర్తల మధ్య సరదా సంభాషణలు ప్రేక్షకులను నవ్వించేలా ఉన్నాయి. అయితే అసలు ట్విస్ట్ మాత్రం చివర్లో కనిపిస్తుంది.
శ్రీను, శ్రీలత చివరకు విడాకుల పత్రం వరకు ఎందుకు వెళ్లారు, వారి మధ్య ఏం జరిగింది అనే ప్రశ్నలను టీజర్ లేవనెత్తుతోంది. ‘ఇడుపు కాయితం’ అంటే విడాకుల పత్రం అనే అర్థం కావడంతో టైటిల్‌కు తగ్గట్టుగానే కథలో కీలక మలుపు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
‘బలగం’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి, కంటెంట్ ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ జానపద పాటలతో గుర్తింపు పొందిన నాగదుర్గ ఈ చిత్రం ద్వారా కథానాయికగా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు.
దీపావళి సందర్భంగా విడుదలైన ‘బారాత్ బీట్’ పాటలో ఆమె మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంది.
వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై సుకుమార్, తబితా సుకుమార్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘శ్రీలత’, ‘గడప’, ‘బారాత్ బీట్’ పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ‘ఇడుపు కాయితం’ చిత్రాన్ని డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.




