ఇచ్చోడ మొరం తవ్వకాలు, NewzFast Telugu (ఇచ్చోడ, ఆదిలాబాద్ జిల్లా): ప్రకృతి సంపదను కాపాడాల్సిన అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఇచ్చోడ మండల కేంద్రంలో మొరం తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎల్లమ్మకుంట మరమ్మతుల పేరుతో మొరం తవ్వి ప్రైవేట్ వ్యాపార సముదాయాలకు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మేజర్ గ్రామపంచాయతీ సిబ్బంది సమక్షంలోనే ఈ పనులు జరుగుతున్నాయని విమర్శలు రావడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.
అనుమతులు ఉన్నాయా, ఎంత మేర మొరం తీస్తున్నారు, దాన్ని ఎక్కడ వినియోగిస్తున్నారనే వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పేరిట కూడా మొరం తీసుకుని ఉండవచ్చని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండానే మొరం తరలిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరగాలని స్థానికులు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో వాల్టా, 1/70 చట్టాలు, పీసా నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ, గిరిజనేతరుల ప్రైవేట్ వ్యాపార సముదాయాలకు పంచాయతీ పరోక్షంగా సహకరిస్తోందనే విమర్శలు ఉన్నాయి.
ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తున్న కొందరు కుల సంఘాల నాయకులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా, పంచాయతీ సిబ్బంది పాత్ర ఏమిటి, ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగిందా అనే అంశాలను తేల్చాలని స్థానికులు కోరుతున్నారు.
గురువారం ఈ విషయమై ఈవో సురేష్‌ను ఫోన్లో సంప్రదించగా, ఈ విషయం తనకు తెలియదని, ఉపసర్పంచ్‌ను అడగాలని ఆయన స్పందించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ రేఖ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్లకు మొరం తీసుకెళ్తున్నట్టు సమాచారం ఉందని, ప్రైవేట్ వ్యాపార సముదాయాలకు గ్రామపంచాయతీ వారు మొరం వేస్తున్నారనే అంశాన్ని రేపు పరిశీలించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రకృతి సంపదను కాపాడేందుకు అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.




