హైడ్రా కమిషనర్ రంగనాథ్, NewzFast Telugu (హైదరాబాద్, మేడ్చల్): ఓ కోర్టు ధిక్కరణ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తమ ఎదుట హాజరుపరిచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే కేసులో శంషాబాద్ తహసీల్దార్ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులను ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఈ ఇద్దరు అధికారులు దాఖలు చేసిన దరఖాస్తులను జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.
వారు చెప్పిన కారణాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని పేర్కొంది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 626/2ఏఏలో తమ భూమిలోని నిర్మాణాలను కూల్చి, భూమిని బలవంతంగా లాక్కున్నారని హైదరాబాద్ జహానుమా ప్రాంతానికి చెందిన తాజమలుద్దీన్ అలియాస్ మొయినుద్దీన్‌ఖాన్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరిగింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనల ప్రకారం, సదరు భూమిని రిజిస్ట్రేషన్ యాక్ట్-1908 సెక్షన్ 22ఏ (నిషేధిత జాబితా) నుంచి తొలగించాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు గతంలో అవకాశం ఇచ్చింది. ఆ దరఖాస్తును పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించిందని ఆయన గుర్తు చేశారు.
2024లో హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైడ్రా కమిషనర్, తహసీల్దార్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని, అక్కడి నిర్మాణాలను, కంచెను కూల్చేశారని ఆరోపించారు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఆ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించారన్నారు.
గత విచారణ సందర్భంగా వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ఫారం-1 నోటీసులు ఇచ్చినా హైడ్రా కమిషనర్, శంషాబాద్ తహసీల్దార్ నిర్లక్ష్యం చేయడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నెల 17న వ్యక్తిగతంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ, సైబరాబాద్ పోలీసులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
మరో కోర్టు ధిక్కరణ కేసులో మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరి వ్యక్తిగతంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌కు కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ భూసంస్కరణల చట్టం-1973 ప్రకారం తన భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ కోడూరి అర్జున రావు దాఖలు చేసిన పిటిషన్‌పై 2025 జూలై 8న సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదని పిటిషనర్ మళ్లీ కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో కలెక్టర్ దాఖలు చేసిన మినహాయింపు దరఖాస్తును ధర్మాసనం డిస్మిస్ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా పడింది.




