హైదరాబాద్ నూతన సీపీ మహేష్ భగవత్, NewzFast Telugu (హైదరాబాద్): నగర నూతన పోలీసు కమిషనర్(సీపీ)గా మహేష్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన నగరంలోని శాంతి భద్రతల అంశంపై మాట్లాడారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, మహిళా భద్రత, ట్రాఫిక్ వంటివి కీలక అంశాలని ఆయన పేర్కొన్నారు.
ప్రతి ఏటా 1.80 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని, అందుకే ఈ అంశాలకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు.
భూ విలువలు పెరగడంతో భూ తగాదాల్లో దాడులు జరుగుతున్నాయని, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో అనుభవం ఉన్న అధికారులు ఎందరో ఉన్నారని, అందరం కలిసి టీమ్‌గా పనిచేస్తామని తెలిపారు.
తరచూ నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్‌లు ప్రయోగిస్తామని చెప్పారు.
పాత నేరస్థులపై నిఘా పెట్టడంతో పాటు నేరాలకు పాల్పడినవారికి శిక్ష పడేలా చూస్తామని సీపీ మహేష్ భగవత్ భరోసా ఇచ్చారు. అనంతరం గతంలో సీపీగా పనిచేసిన సీవీ ఆనంద్, సజ్జనార్లను ఆయన అభినందించారు.
వారు ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు.
ప్రజల కోసం మరికొన్ని సేవలు తీసుకొస్తామని తెలిపారు. డయల్ 112 స్పందనను మరింత మెరుగుపరుస్తామని, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న ముఠాలపై నిఘా పెడతామని పేర్కొన్నారు.
సాయంత్రం వేళల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నందున బేసిక్ పోలీసింగ్‌పై దృష్టి సారిస్తామని చెప్పారు.
సిబ్బంది పోలీస్ స్టేషన్లో కూర్చోకుండా సాయంత్రం వేళల్లో రోడ్లపై విధులు నిర్వర్తించేలా చూస్తామని ఆయన తెలిపారు. పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, శాఖాపరమైన చర్యలూ తీసుకుంటామని హెచ్చరించారు.
కమిషనరేట్ పరిధిలో సిబ్బంది కొరత ఉందని, దాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.




