హుజూర్నగర్ మున్సిపాలిటీ, NewzFast Telugu (హుజూర్నగర్, నల్గొండ జిల్లా): హుజూర్నగర్ మున్సిపాలిటీలో రూ.6.30 కోట్ల ఖర్చుల వివరాలపై జరిగిన చర్చ వాడివేడిగా సాగింది. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సమావేశంలో నిధుల వినియోగం, అభివృద్ధి పనుల బిల్లులపై కౌన్సిలర్లు ప్రశ్నలు లేవనెత్తారు.
పనులు చేయకుండానే కొన్ని బిల్లులు చెల్లించారంటూ పలువురు కౌన్సిలర్లు ఆరోపించడంతో సమావేశంలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల రూ.6.30 కోట్ల ఖర్చులకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సమావేశం నిర్వహించినట్లు చైర్మన్ వెల్లడించారు.
ఖర్చుల వివరాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కౌన్సిలర్లు ఎడ్ల విజయ్, అట్లూరి మంజుల, కోల ఉదయభాను, అమర బోయిన ఊహ, కోడి జ్యోతి, చిట్టి పొత్తుల భద్రమ్మ, నల్గొండ సుజాత సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, మున్సిపాలిటీలో చేపట్టిన ప్రతి పనికి సంబంధించిన బిల్లులు, ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
చేయని పనులకు బిల్లులు తీసుకున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపడుతుండటాన్ని తట్టుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఎవరికైనా సందేహాలు ఉంటే తనను సంప్రదిస్తే పూర్తి వివరాలు అందిస్తానని చెప్పారు.
2023-24 కు సంబంధించి 15 నెలల కార్మికుల పీఎఫ్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పటికే అందుకు సంబంధించిన చెక్కును పంపించామని చైర్మన్ తెలిపారు. కార్మికుల జీతభత్యాలు సకాలంలో చెల్లిస్తున్నామని, ఈ నెల జీతాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలోనే వాటిని చెల్లిస్తామని చెప్పారు.
సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కొందరు కౌన్సిలర్లు వ్యతిరేకత వ్యక్తం చేయగా, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 22 మంది కౌన్సిలర్లు తనకు మద్దతుగా నిలిచారని చైర్మన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, మేనేజర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




